క్రైం కార్నర్
● పాతకక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడి
నవీపేట: మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో బావపై బావమరిది గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. లింగాపూర్ గ్రామానికి చెందిన గంధం శ్రీనివాస్ సోదరిని ఆశాజ్యోతి కాలనీకి చెందిన చెందిన హన్మాండ్లు కొన్నేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గుండారం గ్రామ శివారులోని మహంకాళి ఆలయంలో హన్మాండ్లు ఆదివారం బంధువులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో హన్మాండ్లుకు ఇతర వ్యక్తులతో స్వల్పంగా ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని బావమరిది గంధం శ్రీనివాస్‌కు ఫోన్‌లో చెప్పగా ఆయన స్నేహితులను తీసుకొనికి మహంకాళి ఆలయానికి వచ్చారు. కానీ అప్పటికే గొడవ సద్దుమణిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన గంధం శ్రీనివాస్ బావ హన్మాండ్లుకు ఫోన్ చేసి తాగిన మైకంలో దూషించాడు. ఇరువురు గొడవపడగా పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని హన్మాండ్లు తల, వీపుపై గంధం శ్రీనివాస్ గొడ్డలితో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన హన్మాండ్లును ఆస్పత్రికి తరలించామని, బాధితుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
దోమకొండ: చేపలవేటకు వెళ్లిన యువకుడు నీటమునిగి మృతిచెందిన ఘటన దోమకొండ మండలం కోనాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెంట స్వామి(40) రోజూ మాదిరిగా గ్రామ శివారులోని ఎగువ మానేరు నీటిలో చేపలవేటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. రాత్రి ఒడ్డు వద్దకు శవం కొట్టుకువచ్చింది. మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


