31 నుంచి బడాపహాడ్ ఉర్సు
వర్ని: బడాపహాడ్ ఉర్సు ఈ నెల 31 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు వక్ఫ్ బోర్డు డిప్యూటీ సూపరింటెండెంట్ జమాల్ తెలిపారు. మొదటిరోజు జలాల్పూర్ గ్రామంలో బడాపహాడ్ దర్గా పూజారుల ఇంటి నుంచి గంధాలను తీసుకొని మేళతాళాలు, నృత్యాల ఊరేగింపుతో బడాపహాడ్‌కు తీసుకువస్తారని పేర్కొన్నారు. మూడు రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కవ్వాలి, దీపారాధన నిర్వహిస్తామన్నారు. ఉర్సు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉర్సుకు వచ్చే భక్తులకు తాగునీరు, ప్రత్యేక బస్సు, వైద్య శిబిరాలు, రాత్రి బస చేసేందుకు ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
బోధన్: బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బోధన్ సీడీపీవో తాళ్ల పద్మ నియామకమయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమా, నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కరిపె రవీందర్, దారం భూమన్న, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ సంఘ బలోపేతం, సభ్యులు సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
బోధన్‌టౌన్(బోధన్): అక్రమ చలామణిలో పట్టుబడిన నిషేధిత గుట్కా, పాన్ మసాలా, చైనా మంజా, పేకాట కార్డులను న్యాయమూర్తి సమక్షంలో సోమవారం కోర్టు ఆవరణలో కా ల్చివేశారు. సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ శేష సాయి తల్ప ఆధ్వర్యంలో న్యాయ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.10వేల విలువజేసే నిషేధిత వస్తువులను దగ్ధం చేశారు. ప్రజా ఆరోగ్యానికి హానికలిగించే గుట్కా, పాన్ మసాలా, చైనా మంజాలు, పేకాట కార్డులను విక్రయించొద్దని సూచించారు.
నిజామాబాద్‌అర్బన్: పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గేలా కృషి చేస్తామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై విస్తృత అవగాహన కల్పి స్తామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాల లు, ప్రధాన జంక్షన్ల వద్ద అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
31 నుంచి బడాపహాడ్ ఉర్సు
31 నుంచి బడాపహాడ్ ఉర్సు


