వడ్ల డబ్బులు తక్కువొచ్చాయని ఆందోళన
● మహిళా భవనాన్ని ముట్టడించిన రైతులు
జక్రాన్‌పల్లి: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యం డబ్బులు తక్కువగా వచ్చాయని పడకల్ రైతులు సోమవారం మహిళా భవనాన్ని ముట్టడించారు. గ్రామంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. సుమారు 54 లారీల ధాన్యాన్ని రైతులు నుంచి మహిళా సమాఖ్య సభ్యులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2389 ప్రకారం రావాల్సిన డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో మహిళా సమాఖ్య సభ్యులను నిలదీయగా తమకేమీ తెలియదని కొనుగోలు చేసేందుకు జక్రాన్‌పల్లి తండాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నట్లు తెలపడంతో రైతుల్లో అనుమానాలు తలెత్తాయి. ఆగ్రహించిన రైతులు మహిళా సమాఖ్య భవనాన్ని ముట్టడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిని పిలిచి విచారించారు. రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాలుకు 8 నుంచి 10 కిలోల చొప్పున కటింగ్ చేశారని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరానికి 40 బస్తాలు మాత్రమే తూకం వేయాలని సూచించిందని, అంతకన్నా ఎక్కువ ఉంటే వేరే రైతుల పేరు మీద తూకం వేశామని తెలిపారు. అందుకే డబ్బులు రావడంలో తికమక అయ్యిందని సదరు వ్యక్తి వివరణ ఇచ్చారు. మిల్లర్లతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో డబ్బులు వచ్చేలా చేస్తానని చెప్పారు. పోలీసులు రైతులతో మాట్లాడి నాలుగైదు రోజులు ఓపికపట్టాలని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం గంగాధర్‌ను వివరణ కోరగా ట్రాక్‌షీట్‌లను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.
వడ్ల డబ్బులు తక్కువొచ్చాయని ఆందోళన


