ఏటీఎం దొంగల కోసం ముమ్మర గాలింపు
● కంటైనర్‌లో పారిపోయినట్లు అనుమానం
● అమ్మకానికి పెట్టిన కారు నంబర్‌ను
వినియోగించిన దుండగులు
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున రెండు ఏటీఎంలు కొల్ల్లగొట్టిన దొంగల కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. జాతీయ రహదారి 44 వెంబడి హర్యాణా వైపు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలో దొంగల కారు వెళ్లిన దృశ్యాల ఆధారంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే, దొంగలు వినియోగించిన కారు నంబర్‌తో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టిన కారు నంబర్‌ను దుండగుల కారుకు వినియోగించుకున్నారు. అంతేకాకుండా జాతీయ రహదారి వరకు కారును వినియోగించి అనంతరం కంటైనర్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీ జరిగిన సమయం నుంచి ఆదివారం వరకు 44వ జాతీయ రహదారి వెంట ఉన్న టోల్‌ప్లాజాల వద్ద కారు కనిపించలేదు. దీంతో కంటైనర్‌లో కారుతో సహా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ఏటీఎంల చోరీకి ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఏటీఎంలలో బ్యాంకు అధికారులు ఒకరోజు ముందుగానే డబ్బులు జమ చేశారు. అనంతరం దోపిడీ జరిగింది. హర్యాణా రాష్ట్రానికి చెందిన నెవత్ గ్యాంగ్ పనేనని పోలీసులు భావిస్తున్నారు. వీరు కేవలం ఏటీఎంలు, బ్యాంకుల దోపిడీ మాత్రమే చేస్తారని తెలిసింది.


