స్వరాన్ని మార్చి.. వినోదాన్ని పంచి..
రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటా..
● ప్రజల మన్ననలు పొందిన పలువురు మిమిక్రీ కళాకారులు
● నేడు అంతర్జాతీయ మిమిక్రీ దినోత్సవం
ఆర్మూర్: ధ్వని అనుకరణ కళతో స్వరాన్ని మార్చి తమ గొంతుతో ప్రకృతి హొయలు, జంతువులు, పక్షుల అరుపులు, ప్రముఖుల గొంతులను అనుకరిస్తూ మిమిక్రీ కళకే వన్నె తెస్తున్నారు జిల్లాలోని పలువురు కళాకారులు. కాగా ప్రపంచ ప్రఖ్యాత ధ్వని అనుకరణ సామ్రట్ దివంగత నేరేళ్ల వేణుమాధవరావు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
జిల్లాకు చెందిన జాదూ యుగంధర్ రంగనాథ్, బోండ్ల ఆనంద్, సౌడ రవి, వాస రాబర్ట్ లాంటి కళాకారులు మిమిక్రీ కళపై మక్కువను పెంచుకొని తమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. రంగనాథ్ వెంట్రిలాక్విజం కళ ద్వారా ధ్వని అనుకరణ చేస్తూ ప్రదర్శననివ్వడం వీక్షకులను ప్రత్యేకంగా అలరిస్తుంది. హాస్యరసాన్ని పండిస్తూ మాట్లాడే బొమ్మతో ప్రదర్శనను చూడటానికి ప్రతీ ఒక్కరు ఇష్టపడతారు. అలాగే ఆర్మూర్ పట్టణానికి చెందిన బోండ్ల ఆనంద్ అనే యువకుడు 26 సంవత్సరాలుగా మిమిక్రీ రంగంలో రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. చిన్నతనం నుంచే కళలల వైపు ఆకర్షితుడైన ఆనంద్ తన గురువు జాదూ యుగంధర్ రంగనాథ్ వద్ద మిమిక్రీ మెలకువలు నేర్చుకున్నాడు. మిమిక్రీ సీనియర్ కళాకారుడు, మెజీషియన్ అయిన తన గురువుతో కలిసి ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆనంద్ తన మిమిక్రీ ద్వారా సినీ నటులు, రాజకీయ నాయకులను, పశు, పక్షాదులు, వాహన సముదాయాలకు సంబంధించిన దాదాపు 62 రకాల గొంతుకలను పలికించగలడు. ప్రతి సంవత్సరం ఆర్మూర్‌లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆనంద్ మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆనంద్ చాలాసారు ముఖ్య అధికారులు, నాయకుల చేతుల మీదుగా సన్మానాలు అందుకున్నారు. ప్రపంచ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట నెలకొల్పిన అవార్డును సైతం ఆనంద్ అందుకున్నాడు.
వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన సౌడ రవి వృత్తి రీత్యా ఆర్మూర్ మండలం చేపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ధ్వని అనుకరణపై ఉన్న మక్కువతో మిమిక్రీ కళాకారుడిగా రాణిస్తున్నాడు. విద్యార్థులకు చదువుతో పాటు తన ధ్వని అనుకరణను ప్రదర్శిస్తూ పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నాడు. సినీ నటులు రావుగోపాల్‌రావు, సుధాకర్, రాజశేఖర్, నాగార్జున, నాగేశ్వర్‌రావు, సాయికుమార్, రాజకీయ నాకులు చంద్రబాబు నాయుడు, రోశయ్య, హనుమంతరావుల గొంతులను అనుకరించడంలో దిట్ట. ఇలా జిల్లాలోని పలువురు కళాకారులు మిమిక్రీ రంగంలో రాణిస్తూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు.
సౌడ రవి, మిమిక్రీ కళాకారుడు, ఆర్మూర్
బోండ్ల ఆనంద్, మిమిక్రీ కళాకారుడు, ఆర్మూర్
జాదూ యుగంధర్ రంగనాథ్, మెజీషియన్, మిమిక్రీ కళాకారుడు
మిమిక్రీ కళను నమ్ముకొన్న నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రులు, గురువు, మెజీషియన్ రంగనాథ్, భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్‌ల ప్రోత్సాహంతో మిమిక్రీ చేస్తున్నాను. ఈ కళను మరింత మెరుగు పర్చుకొని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటా.
–బోండ్ల ఆనంద్,
మిమిక్రీ కళాకారుడు, ఆర్మూర్
స్వరాన్ని మార్చి.. వినోదాన్ని పంచి..
స్వరాన్ని మార్చి.. వినోదాన్ని పంచి..
స్వరాన్ని మార్చి.. వినోదాన్ని పంచి..


