చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● నందిపేట్ తహసీల్ కార్యాలయం తనిఖీ
నందిపేట్(ఆర్మూర్): భూ భారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నందిపేట తహసీల్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించి, భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. మండలంలోని గ్రామాల వారీగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఆర్జీలను, సాదాబైనామాల పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అర్జీలను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించొద్దని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. సమావేశంలో తహసీల్దార్ సంతోష్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


