యూరియాను అందుబాటులో ఉంచాలి
● రైతులకు ఇబ్బందులు ఏర్పడితే
అధికారులదే బాధ్యత
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● ఖానాపూర్‌లో ఎరువుల గోదాం తనిఖీ
నిజామాబాద్ రూరల్: జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోదాంలలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఖానాపూర్‌లోని ఎరువుల గోదాంను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నందున ఎక్కడ కూడా కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు చేరవేయాలని అధికారులకు సూచించారు. ఎరువుల కేటాయింపులు, పంపిణీ ప్రక్రియను ప్రతి రోజు పర్యవేక్షించాలని, ఎక్కడైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే పరస్పర సమన్వయంతో వెంటనే వాటిని పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటికే సరిపడా స్టాక్ ఉందని, ఇంకనూ యూరియా నిల్వలు ముందస్తుగానే తెప్పిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. డీఏవో వీరాస్వామి, సహకార శాఖ అధికారి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.


