ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి నెట్‌వర్క్: నగరంలో గురువారం క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నగరంలోని సీఎస్‌ఐ, నిర్మల హృదయ చర్చీలతోపాటు, వివిధ ప్రాంతాల్లోని పలు చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ హాజరై, మాట్లాడారు. యేసు క్రీస్తు జీవితం వినయం, త్యాగం, సేవలకు ఉదాహరణ అని తెలిపారు. యేసు బోధించిన ప్రేమ, క్షమ, సేవ విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిబింబించాలన్నారు. ముబారక్‌నగర్‌లోని జీసస్ లవ్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.


