● జోరుగా వరి నాట్లు
నందిపేట్(ఆర్మూర్): యాసంగి సీజన్ వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పంట చివరి దశలో సాగునీరందక ఎండిపోయే అవకాశం ఉండడంతో పలువురు రైతులు ముందస్తుగా వరినాట్లు వేస్తున్నారు. జిల్లాలో యాసంగి సీజన్‌లో 4.31 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ బావులు, బోర్ల సౌకర్యం ఉన్న రైతులు వరినాట్లు ప్రారంభించారు. గుత్ప, అలీసాగర్‌తోపాటు పలు ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు వస్తాయన్న ఆశతో మిగతా రైతులు నాట్లేసేందుకు వీలుగా పొలాలను సిద్ధం చేస్తున్నారు. నందిపేట మండలంలోని తల్వేద, కంఠం, అయిలాపూర్, బజార్‌కొత్తూర్, చింరాజ్‌పల్లి, లక్కంపల్లి, సీహెచ్ కొండూర్, ఉమ్మెడ గ్రామాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. గతంతో ఎన్నడూ లేనంతగా ఈ యాసంగి సీజన్‌లో సన్నాలకు సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన వరిఽ ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లించగా ప్రైవేట్ వ్యాపారులు సైతం పోటీపడి ధాన్యం కొనుగోలు చేశారు. ‘ వచ్చే వారం రోజుల్లో గుత్ప ఎత్తిపోతల నీళ్లు విడుదలయ్యే అవకాశం ఉండటంతో గ్రామాల్లో నాట్లు ఊపందుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం సన్నరకాలకు రూ.500 బోనస్ చెల్లించడంతో రైతులు సన్నాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు’ అని ఆర్మూర్ డివిజనల్ వ్యవసాయాధికారి విజయలక్ష్మి వివరించారు.


