మాతా శిశువుల సంరక్షణపై దృష్టి సారించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో మాతా శిశు సంరక్షణపై వైద్యులు, సిబ్బంది దృష్టి సారించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ చేపట్టాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై ఒక్కో ఘటన వారీగా కలెక్టర్ వివరంగా విచారణ చేపట్టారు.
మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేస్తూ వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్లినా వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు, అంగన్‌వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అంతకుముందు గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ, తగిన అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి పరమేశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్వేత, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, సైకియాట్రిస్ట్ విశాల్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్యాధికారులు, వైద్యులు పాల్గొన్నారు.


