గుంజీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ధర్పల్లి: మానవ జీవితంలో గుంజీలు తీయడంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని గుంజీళ్ల అంతర్జాతీయ శిక్షకులు అందె జీవన్‌రావు అన్నారు. మండలంలోని చల్లగర్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ, మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా గుంజీలు పనిచేస్తాయన్నారు. మన దేశంలో విద్యార్థులచే గుంజీలు తీయించే పద్ధతిని శిక్షగా భావించడంతో పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతుందని పేర్కొన్నారు. యోగా చేయడంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాదె నరేష్, ఇన్‌చార్జి సురేష్, ఉపాధ్యాయులు జ్యోతి, లక్ష్మి, సాయారెడ్డి, శ్రీదేవి, రవీందర్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


