ఏ రకమైనా రూ.100 పైనే...
● భారీగా పెరిన కూరగాయల ధరలు
● అధిక వర్షాలతో నీటమునిగిన పంటలు
● జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం
● ఏపీ, కర్ణాటక, ఎంపీ నుంచి దిగుమతి
సుభాష్‌నగర్ : కూరగాయల ధరలు సామాన్యులను వణికిస్తున్నాయి. ఏది కొనాలన్నా రూ. వందకుపైనే పలుకుతుండటంతో ప్రజలు పావుకిలో, అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. జేబులో రూ.500 లేనిదే మార్కెట్‌కు వెళ్లలేని పరిస్థితి. గత 10 రోజుల క్రితం వరకు రూ.30 నుంచి రూ.50 వరకు ఉన్న ధరలు.. అమాంతంగా పెరిగిపోయాయి. టమాట, ఉల్లిగడ్డ రూ.50 ఉండగా, మిగ తా బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, బెండకాయ, కాకరకాయ, ఆకుకూరలు ఇలా అన్నింటి ధరలు రూ.వందకుపైనే పలుకుతున్నాయి. అధిక వర్షాల ప్రభావం కూరగాయల దిగుబడిపై పడటంతోనే ధరలు పెరిగిపోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వారానికి సరిపడా కూరగాయ లు కావాలంటే గతంలో రూ.150 నుంచి రూ.200 సరిపోయేవి. ప్రస్తుతం రూ.500 పైనే ఖర్చవుతున్నాయి.
జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం క్రమక్రమంగా పడిపోయింది. ప్రస్తుతం అన్ని కూరగాయలు కలిపి 500 ఎకరాల లోపే సాగవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. గతంలో నిత్యం 700 క్వింటాళ్ల వరకు కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం సగటున 400 క్వింటాళ్ల వరకు మాత్రమే వస్తున్నాయి. మహారాష్ట్రలో అధిక వర్షాల కారణంగా పంటలు నీటమునిగి ధ్వంసమయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. మరో 45 రోజుల నుంచి 60 రోజుల వరకు ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారవర్గాల ద్వారా తెలుస్తోంది.
కూరగాయల మార్కెట్‌లో ఏది కొనాలన్నా.. రూ.100 వరకు చెబుతున్నారు. టమాట మినహా మిగతా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే రెట్టింపయ్యాయి. పావు కిలో, అర కిలో తీసుకుంటున్నాం. మరో నెలరోజుల వరకు ఇలాగే ఉంటాయంటున్నారు. వీటి కన్నా పప్పులు తినడం మేలు అనిపిస్తుంది.
– గంగామణి, చిన్నాపూర్
జిల్లా కేంద్రంలో కూరగాయలు కిలో ధర (రూ.లలో)
కూరగాయలు హోల్‌సేల్ రిటైల్
(కిలో) (కిలో)
గోరు చిక్కుడు 70 120
బెండకాయ 70 120
బీరకాయ 70 100
మునగకాయ 70 100
చిక్కుడుకాయ 50 80
కొత్తిమీర 70 80
క్యాలీప్లవర్ 50 80
కాకరకాయ 50 80
వంకాయ 50 80
మెంతికూర 50 80
పాలకూర 50 80
పచ్చిమిర్చి 40 60
క్యాప్సికమ్ 50 80
టమాట 24 50
ఆలుగడ్డ 30 50


