పూర్ణ కుటుంబాన్ని ఆదుకుంటాం
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
సిరికొండ : చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన మాలావత్ పూర్ణ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. పాకాల గ్రామంలో పూర్ణ తండ్రి దేవిదాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, పూర్ణను మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు. పూర్ణను, ఆమె తల్లి లక్ష్మి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. పూర్ణను త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో కలిపిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఆమె తండ్రి వైద్య ఖర్చులను సీఎంతో మాట్లాడి ఇప్పిస్తానన్నారు. ఎవరెస్ట్ అధిరోహించినపుడు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను సీఎంతో మాట్లాడి ఇప్పించి వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్కను పలువురు సన్మానించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు వినతి పత్రం అందచేశారు. మంత్రి మాట్లాడుతు పాకాల నుండి పందిమడుగు వెళ్లే రోడ్డుకు అటవీ అనుమతులు ఇప్పించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి ఎన్ని అవసరం అయితే అన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, పార్టీ మండలాధ్యక్షుడు బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, ఎర్రన్న, బాల్‌రాజ్‌నాయక్, బండారి నరేష్, డీటీడీవో నాగోరావు, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పూర్ణను పరామర్శిస్తున్న మంత్రి సీతక్క


