స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

Nov 21 2025 7:33 PM | Updated on Nov 21 2025 7:33 PM

స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌

రాణి కుముదిని

జిల్లా కలెక్టర్‌, అధికారులతో

వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌ : స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సృజన, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో మాట్లాడారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితాపై అభ్యంతరాలు, పోలింగ్‌ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్షించారు. పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్‌ టి వినయ్‌ కృష్ణారెడ్డి కలెక్టరేట్‌ నుంచి వీసీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ మాట్లాడుతూ, సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలను మూడు విడతలలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఎన్నికల పరిశీలకులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలన్నారు. 2011 ఎన్నికల జాబితా ప్రకారం షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, 2024 ఎస్‌ఈఈఈపీసీ సర్వే ప్రకారం వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

కలెక్టర్‌ వినయ్‌ కష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో గ్రామ పంచాయతీలు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతామని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది, ఎన్నికల సామగ్రిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే పై స్థాయి అధికారులను సంప్రదించి ముందుగానే నివత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను నిర్వహించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, సబ్‌ కలెక్టర్లు వికాస్‌ మహతో, అభిగ్యాన్‌ మాల్వియ, డీఆర్డీవో సాయాగౌడ్‌, డీపీవో శ్రీనివాస్‌ రావు, డీఈవో అశోక్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement