
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సేవలు భేష్
గోసేవలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు..
● వరద విపత్తులో సాహసోపేతమైన
కృషిని కనబర్చాయి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
సుభాష్‌నగర్: భారీ వర్షాలతో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆయా బృందాలను శనివారం ఆయన అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించామన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన ఆ యా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విపత్తు ప్రతిస్పందన దళాలు సాహసోపేతమైన కృషిని కనబర్చాయన్నారు. బోధన్ మండలం హంగర్గలో వరదల్లో చిక్కుకున్న సుమారు 480 మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ చేశాయని అన్నారు. అదేవిధంగా రెంజల్ మండలం కందకుర్తి వద్ద సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమంలో వరదలలో చిక్కుకున్న 8 మందిని విపత్తు సహాయక సభ్యులు ప్రాణాలకు తెగించి కాపాడారని, ఆశ్రమంలోని మూగ జీవాలకు కూడా అవసరమైన మేత, నీటి వసతిని సమకూర్చారని కలెక్టర్ వివరించారు. సాలూర మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 120 మందిని బోట్ల ద్వారా ఎస్‌డీఆర్‌ఎఫ్, 7వ పోలీస్ బెటాలియన్ బృందాలు రక్షించాయని తెలిపారు. ముత్యాల చెరువు తెగడంతో ధర్పల్లి మండలం వాడి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టగా, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు కొనసాగించిందని తెలిపారు. ఇదే రీతిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కృషిచేశాయని తెలిపారు.
రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి పుష్కరక్షేత్రంలోగల సీతారాం మహరాజ్ త్యాగి ఆశ్రమానికి శనివారం స్థానికులతో కలిసి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం చేరుకుంది. ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరడంతో మూడు రోజుల కిందట ఆశ్రమంలోని మహారాజ్ శిష్యులు, భక్తులను ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వారిని సురక్షితంగా గ్రామానికి తరలించారు. ఆశ్రమంలోని 20 గోవులను మేడపైకి చేర్చారు. మూడు రోజులుగా ఆశ్రమంలోని గోవులకు తాగునీరు, మే త లేకపోవడంతో భక్తులతో కలిసి ఎస్‌డీఆర్‌ఎ ఫ్ బృందాలు మేత, తాగు నీరు అందించింది.

ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సేవలు భేష్