
ఎస్సారెస్పీకి మళ్లీ పోటెత్తిన వరద
● ఇన్‌ఫ్లో 5.4 లక్షల క్యూసెక్కులు రావడం ఈ ఏడాదిలో తొలిసారి
● కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి ప్రాజెక్ట్‌లోకి 5లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరగడంతో గోదావరిలోకి నీటి విడుదలను 5.75 లక్షల క్యూసెక్కులకు పెంచారు. శనివారం మధ్యాహ్నం వరకు అంతే స్థాయిలో నీటి విడుదల కొనసాగింది. రాత్రి కి వరద నీరు మళ్లీ పోటెత్తింది. రాత్రి 8 గంటలకు 5 లక్షల 10వేల క్యూసెక్కులకు పెరుగగా, రాత్రి 9 గంటలకు ఏకంగా 5.4లక్షలకు పెరిగింది. ప్రస్తుత సంవత్సరం గరిష్టంగా 5.4 లక్షల క్యూసెక్కుల నీరు రావడం ఇదే తొలిసారి. కానీ గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. 38 వరద గేట్ల ద్వారా 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నీటి మట్టం పెంచుట కోసం నీటి విడుదలను తగ్గించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
165 టీఎంసీలు గంగపాలు..
ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి ఈ నెల 18 నుంచి నీటి విడుదల చేపట్టారు. శనివారం సాయంత్రం వరకు 165 టీఎంసీల నీటిని వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. గడిచిన మూడు రోజుల వ్యవధిలోనే 110 టీఎంసీల నీటిని వదిలారు. ఇప్పటికీ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు కొనసాగుతుంది. అలాగే ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను 12 వేల క్యూసెక్కుల నుంచి 16 వేల క్యూసెక్కులకు పెంచారు. కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 636 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1084.40(58.04 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.