
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
● బ్యాంక్ లోన్ ఇప్పిస్తామంటూ
బంగారం, నగదు చోరీ
● ఐదు జిల్లాల్లో వెలుగుచూసిన ఘటనలు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి క్రైం: సుమారు ఐదు జిల్లాల్లో బ్యాంక్ లోన్ ఇప్పిస్తామంటూ బాధితులను ఎమర్చి బంగారం, నగదు చోరీకి పాల్పడుతున్న అంతర్‌ర్రాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. భిక్కనూర్‌కు చెందిన ఊరె లక్ష్మి దంపతులు స్థానికంగా బొంబు మర్చంట్ దుకాణం నడుపుతున్నారు. ఫిబ్రవరి 26న లక్ష్మి దుకాణంలో ఉండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు. బ్యాంకు నుంచి వచ్చానని, మీ దుకాణంపై రుణం ఇప్పిస్తామని నమ్మించి లక్ష్మిని బ్యాంకుకు తీసుకువెళ్లాడు. పేదవారిగా కనిపిస్తేనే బ్యాంకు అధికారులు రుణం ఇస్తారని, మెడలోని బంగారు గొలుసు తీసేయాలని చెప్పారు. లక్ష్మి మెడలోని 3 తులాల బంగారం గొలుసును తీయగా, మేనేజర్ వద్దకు వెళ్లి వచ్చేదాకా తన వద్ద భద్రంగా ఉంచుతానని నమ్మబలికాడు. ఆమె దృష్టిని మళ్లించి అక్కడ నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, భిక్కనూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్, ఫహీమా బేగం అనే భార్యా భర్తలు కబీరుద్దీన్, దీపక్ కిసాన్ సలుంకే అనే మరో ఇద్దరితో కలిసి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. భిక్కనూర్ టోల్ గేట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు భిక్కనూర్‌తోపాటు ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఈ తరహాలో మొత్తం 8 నేరాలు చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టించిన బైక్ నెంబర్ ప్లేట్..
అఫ్తాబ్ అహ్మద్ షేక్‌పై గతంలో 60 పైగా దృష్టి మళ్లింపు, చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పలు కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినా చోరీలు చేస్తూనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ఐదు జిల్లాల పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్నా తప్పించుకు తిరుగుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ నేరస్తుడి గురించి దొంగ చిక్కడం లేదంటూ పలు టీవీ చానెళ్లలో వార్తా కథనాలు సైతం వచ్చాయన్నారు. ఇదిలా ఉండగా కేసులో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్ అహ్మద్ షేక్ తప్పుడు నెంబర్ ప్లేట్‌తో ఉన్న బైక్‌ను వాడి పోలీసులకు చిక్కాడు. అతడు వాడిన బైక్ ముందర ఒక నెంబర్, వెనుక భాగంలో మరో నెంబర్ ఉండటాన్ని గమనించిన భిక్కనూర్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లాలో ఇప్పటివరకు ఫేక్ నెంబర్ ప్లేట్‌లతో తిరుగుతున్న వాహనాలను పట్టుకుని 6 కేసులను చేధించినట్లు ఎస్పీ తెలిపారు. అందుకే వాహనాల తనిఖీలపై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన భిక్కనూర్ సీఐ సంపత్ కుమార్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఆంజనేయులు, ఉస్మాన్, కానిస్టేబుళ్లు రవి, రాజేందర్, మైసయ్య, రమేష్ యాదవ్, మేకల నరేష్, జి నరేష్ లను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ నరసింహరెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు