
దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు!
త్వరలో పంపిణీ చేస్తాం.
సద్వినియోగం చేసుకోవాలి..
● అర్హుల గుర్తింపు కోసం 23 నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా శిబిరాలు
● వైద్య పరీక్షలు నిర్వహించనున్న
ఆలిమ్‌కో ప్రతినిధులు
ఆర్మూర్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగులకు)కు అవసరమైన పరికరాలను ఉచితంగా అందిచనున్నారు. ఇందుకోసం అర్హులను గుర్తించడానికి శిబిరాలను తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌లో మూడు శిబిరాల నిర్వహణకు ఉన్నతాధికారులు అనుమతులనిచ్చారు. శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, వినికిడిలోపం, అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, చంక కర్రలు, ట్రై సైకిళ్లు, రొలేటర్స్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ ప్లేట్స్, ఎమ్మార్ కిట్‌లతో పాటు కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మానిఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్‌కో) సహకారంతో ఈ శిబిరాలను నిర్వహించడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఉన్న 4,125 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలలో సుమారు 500 మందికి పరికరాలు అవసరం ఉన్నట్లు ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ)లు గుర్తించారు. వీరిని శిబిరాలకు తరలించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శిబిరానికి వచ్చే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్రావలింగ్ అలవెన్స్ (టీఏ), భోజన సదుపాయం కల్పించనున్నారు.
ఏమేమి తీసుకొనిరావాలి..
సున్నా నుంచి 18 సంవత్సరాల ఏళ్లలోపు గల ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మాత్రమే ఈ శిబిరాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇన్‌కం సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతోపాటు మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్‌లేని సందర్భంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యునిచే ధృవీకరించిన పత్రంపై ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయుడి అటెస్టేషన్ చేపించుకొని తీసుకొని రావాల్సి ఉంటుంది.
అలిమ్‌కో ప్రతినిధులు అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సిఫార్సు చేస్తారు. 60 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు, 40 శాతం సహిత విద్యా విభాగం నిధులు వెచ్చించి పరికరాలను సమకూర్చుకొని ఎంపిక చేసిన లబ్ధిదారులకు త్వరలో అందజేస్తారు. రాయితీపై అందజేసే బస్ పాస్‌ను సైతం ఈ శిబిరంలో అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శిబిరం వేదికలు:
23న: సీఎస్‌ఐ హెచ్‌పీడీ బదిరుల పాఠశాల, సీఎస్‌ఐ కాంపౌండ్, ఆర్మూర్
25న: ప్రభుత్వ జేసీ హైస్కూల్, బోధన్
26న: న్యూ ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్, న్యూహౌజింగ్ బోర్డు కాలనీ(కేసీఆర్ కాలనీ), నిజామాబాద్
దివ్యాంగులకు అలిమ్‌కో ప్రతినిధులు అవసరమైన పరికరాల గుర్తింపు పరీక్షలు నిర్వహించి, అర్హులను గుర్తిస్తారు. వారికి పరికరాలను అతి త్వరలో ఉచితంగా అందజేస్తాము. పరికరాల అందజేత సమచారాన్ని అర్హులకు తెలియజేస్తాం. – పడకంటి శ్రీనివాస్‌రావు,
సహిత విద్యావిభాగం జిల్లా ఇన్‌చార్జి కోఆర్డినేటర్
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉచితంగా అందజేస్తున్నాము కాబట్టి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– అశోక్, డీఈవో, నిజామాబాద్

దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు!

దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు!