
జిల్లా కోర్టులో జెండా ఆవిష్కరించిన జడ్జి
నిజామాబాద్ లీగల్: స్వాతంత్య్ర వేడుకలను జిల్లా కోర్టులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయభాస్కర్ రావు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్జీలు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తన క్యాంప్ ఆఫీస్‌తోపాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమాల్లో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, టీజీవో జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అమృత్‌కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మోర్తాడ్(బాల్కొండ): యూరప్ పంపిస్తామని నమ్మించి వేల్పూర్ మండలం పడిగెలకు చెందిన గంగాప్రసాద్‌ను యూఏఈలోనే ఉండిపోయేలా మోసగించిన ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రవాసీ ప్రజావాణిలో బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి స్పందించి బాధితునికి న్యాయం చేయాలని సీపీ సాయి చైతన్యకు లేఖ రాశారు. సీపీ ఆదేశాల మేరకు ఆలూర్ మండలం మచ్చర్లకు చెందిన ఆర్ నారాయణ, హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ జబ్బర్‌లపై వేల్పూర్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో దుబాయ్‌లో చిక్కుకుపోయిన గంగాప్రసాద్‌ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ చొరవ తీసుకుంటుందని అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

జిల్లా కోర్టులో జెండా ఆవిష్కరించిన జడ్జి