
‘ఓట్ల చోరీ’ గడపగడపకూ తీసుకెళ్లాలి
● బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతుందని, సుప్రీంకోర్టు తీర్పు ఇందుకు నిదర్శనమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఓట్ చోర్.. గద్దె చోడ్ నినాదాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని న్యాల్‌కల్ గ్రామంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాసాని చెరువు గేట్లు ఎత్తి నిజాంసాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఓట్ల చోరీకి పాల్పడుతూ ప్రజల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. బిహార్‌లో 65లక్షల ఓట్లు తొలగించిందని, దీనిపై రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి..
మాసాని చెరువు నుంచి నిజాంసాగర్ కెనాల్ ద్వారా 15వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని, రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. వర్షాలు ముందుగా కురవడంతో రైతులు త్వరగా నాట్లు వేశారని, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలకు సాగునీరు అవసరమని పేర్కొన్నారు. సొసైటీ పాలకవర్గాల గడువు పొడిగింపు శుభపరిణామమని, రైతులకు మరింత సేవ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, ఫిషర్‌మెన్ జిల్లా చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ బాలరాజు, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, నాయకులు గంగాప్రసాద్, ప్రతాప్‌సింగ్, కిరణ్‌రావు, బొడ్డు రఘు, కెతడి నారాయణ, సడక్ శేఖర్, సతీశ్ రావు, సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.