
మెరుగైన వైద్య సేవలు అందించాలి
● డిచ్‌పల్లి సీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్
డిచ్‌పల్లి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, జనరల్ వార్డు, ల్యా బ్ తదితర విభాగాల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రౌండ్ ది క్లాక్ ఆస్పత్రుల్లో అన్ని సమయాల్లో వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు. ప్రతీ నెల రెండో శనివారం ప్రత్యేకంగా నిర్వహించే ఆరోగ్యశ్రీ శిబిరానికి అన్ని విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు హాజరయ్యేలా చూడాలని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల పనితీరును ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు.
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
భూభారతి దరఖాస్తుల పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్‌పల్లి తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ సతీశ్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు.