
చోరీకి పాల్పడిన ముగ్గురి నిందితుల అరెస్ట్
మాక్లూర్: మండలంలోని కృష్ణనగర్‌లో ఇటీవల శ్రీహరి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురి నిందితులను మాక్లూర్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రాజారత్నం తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 1న కృష్ణనగర్‌లో తాళం వేసి ఉన్న శ్రీహరి ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం మాణిక్‌బండార్ చౌరస్తాలో అనుమానంగా తిరుగుతున్న ముగ్గురి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారింగా కృష్ణనగర్‌లో చోరీకి పాల్పడింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 4.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. పదివేల నగదు, రెండు ఫోన్లు, ఐదు బైక్‌లు, రూ. 50 వేలు విలువ చేసే రోల్డ్ గోల్ బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. పట్టుబడిన వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన చాకలి రాజు, కన్నె లింగం, మరొకరు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన నగేశ్ పోలీసులు గుర్తించారు. వీరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన మాక్లూర్ ఎస్సై రాజశేఖర్‌ను ఏసీపీ అభినందించారు.