
పండుగ పూట విషాదం
నవీపేట: రాఖీ పండుగను పురస్కరించుకొని ఓ సోదరుడు అక్కతో రాఖీ కట్టించుకొని స్కూటీపై తిరిగి వస్తుండగా అనంత లోకాలకు వెళ్లిన ఘటన నవీపేట మండలం అబ్బాపూర్ (ఎం) శివారులో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయినాథ్, కవితలకు కుమార్తె సాయిప్రియి, కుమారుడు సాయిబాబు అలియాస్ బబ్లూ(21) ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజుల్‌పేట్‌లో ఉంటున్న కవిత వద్దకు బబ్లూ రాఖీ పండుగ సందర్భంగా శనివారం ఉదయం స్నేహితుడు అరవింద్‌తో కలిసి స్కూటీపై వెళ్లాడు. అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి వస్తుండగా అబ్బాపూర్(ఎం)–జగ్గారావు ఫారమ్ మధ్యలో ముందు వెళ్తున్న కంటెయినర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి దానిని ఢీకొన్నారు. ఈ ఘటనలో బబ్లూ కిందపడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి మేనమామ బలగం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● రాఖీ కట్టించుకొని తిరిగి
వెళ్తుండగా ప్రమాదం
● కంటెయినర్ ఢీకొని యువకుడి మృతి