
గురుకులంలో విశ్వ సంస్కృత భాషా దినోత్సవం
మద్నూర్(జుక్కల్): భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం సంస్కృత భాష అని సంస్కృత భాష ప్రచార సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. అన్ని భాషలకు సంస్కృతం అమ్మభాష అని అన్నారు. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, రామాయణం, మహాభారతం తదితర గ్రంథాలు దేవనాగరిలిపిలో రచించబడ్డాయని చెప్పారు. భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం బోధిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను ప్రేమించాలని, నేర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులు సంస్కృత గేయాలు, సుభాషితాలను, శ్లోకాలను ఆలపించారు. పాఠశాల ప్రిన్స్‌పాల్ గంగాకిషోర్, ఉపాధ్యాయులు సుమన్, నరహరి, సంజీవ్, ఆశోక్, ప్రవీణ్, హన్మండ్లు, నరేష్, బస్వరాజు, విద్యార్థులున్నారు.