
దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ
సుభాష్‌నగర్: దేశం, ధర్మం కోసం పని చేస్తున్న ఏౖకైక పార్టీ బీజేపీ అని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని వర్ని చౌరస్తాలో ఉన్న జనార్దన్ గార్డెన్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అధ్యక్షతన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్యకు ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసే వరకూ కార్యకర్తలు అవిశ్రాంతంగా పోరాడాలని, అప్పుడే రాష్ట్రంలో హిందువులు అనుకున్న విధానాలు అమలవుతాయని అన్నారు. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అనేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. కానీ హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. త్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళలకు, వక్ఫ్‌బోర్డు సవరణతో పేద ముస్లిములకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలు ఏకమైనా.. మోదీని ఏం చేయలేవని, దేశమంతా బీజేపీ వైపే ఉందన్నారు.
బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యత మాదే..
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన కృషితోనే విజయం సాధ్యమైందని, భవిష్యత్తులో బీజేపీ, బీజేపీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు బాధ్యతను తాము తీసుకుంటామని ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీల గెలుపు కార్యకర్తలకు అంకితమని వారు అన్నారు.
ఎమ్మెల్సీల గెలుపులో కార్యకర్తల కృషి
ఎమ్మెల్సీల గెలుపులో కార్యకర్తల కృషి వెలకట్టలేనిదని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు పార్టీపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్, మాదాసు స్వామి యాదవ్, పద్మారెడ్డి, బుస్సాపూర్ శంకర్, కొండా ఆశన్న పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్
ఎమ్మెల్యేలు ధన్‌పాల్, రాకేశ్‌రెడ్డి