నిజామాబాద్ నాగారం: సామాన్యులు ఎవరైనా రెండు నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే ఇంటిముందు హంగామా చేసే విద్యుత్ శాఖ అధికారులు ఓ మాజీ ప్రజాప్రతినిధి ఏడాదిగా తన వ్యాపార సముదాయానికి రూ. కోట్లల్లో కరెంటు బిల్ కట్టకపోయినా నిమ్మకు నీరెత్తినట్లు గప్‌చుప్‌గా ఉండిపోయారు.
ఆర్మూర్ పట్టణంలో..
జిల్లాలోని ఆర్మూర్ నడిబొడ్డున బస్టాండ్ ఆవరణలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు సంబంధించి విద్యుత్ బిల్లులు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నాయి. 2022లో దసరా రోజు ఈ మాల్ ప్రారంభమైంది. ఏడాదికిపైగా రూ. 2.57 కోట్లకు పైగా బిల్లు పెండింగ్‌లో ఉంది. ప్రజాప్రతినిధికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ కావడంతో విద్యుత్ అధికారులు, సిబ్బంది ఆ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతినెలా లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో పెరిగిపోతున్నా పట్టించుకోలేదు. వీటితోపాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బిల్లులు కోట్లలో పెండింగ్‌లో ఉంటున్నాయి.
ప్రభుత్వం మారగానే..
అర్మూర్‌లోని మాజీ ప్రజాప్రతినిధికి చెందిన షాపింగ్ మాల్ ఏడాదిన్నరగా వెళ్లకుండా ప్రభుత్వం మారగానే.. మాల్‌కు కరెంట్‌కట్ చేసి గొప్పలు చెప్పుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ పని ముందే చేయాల్సి ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
ఒకేన్యాయం ఉండాలి
విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో అందరికి ఒ కే న్యాయం ఉండాలి. కరెంట్ బిల్లులు ప్రతి నెలా ఇ స్తున్నారు. ఎవరు బిల్లు కట్టకున్నా కరెంట్ కట్ చేస్తున్నారు. అదే విధంగా పెద్ద, చిన్న, ప్రజాప్రతినిధు లు అని తేడాలేకుండా అందిరికీ ఒకేన్యాయం చే యాలి. పక్షపాత ధోరణి అవలంభించడం సరికాదు.
– రాజేశ్, చంద్రశేఖర్ కాలనీ
పేదలపై ప్రతాపం సరికాదు
పేదలు రెణ్నెళ్ల బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కరెంట్‌కట్ చేస్తున్నారు. కేవలం రూ. వందల్లో పెండింగ్ ఉన్నా సరే..బిల్లులు కట్టమని ఒత్తిడి తెస్తున్నారు. నానాకష్టాలు పడి మరీ బిల్లులు చెల్లిస్తున్నారు. అందరికీ ఒకే నియమం ఉండాలి. ఇది సరైన పద్ధతి కాదు.
– కృష్ణ, సుభాష్‌నగర్