అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తా..! : వడ్డి మోహన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తా..! : వడ్డి మోహన్‌రెడ్డి

Published Sat, Nov 25 2023 1:20 AM

- - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: 'అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో, తానేంటో చూపిస్తానని బోధన్‌ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందని గ్రహించిన ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బోధన్‌లో అవినీతి పేరుకు పోయిందని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తోడు దొంగలని అన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీచేస్తున్నానని ప్రజలు ఆదరించి బీజేపీని గెలిపించాలని కోరారు.' అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వడ్డి మోహన్‌రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. – బోధన్‌

ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది?
► నియోజకవర్గంలో నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. యువగర్జన సభకు ఎంపీ అర్వింద్‌ హాజరయ్యారు. నియోజకవర్గంలో రెండో రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా రానున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

ప్రజా సమస్యలపై మీ సమాధానం?
► బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనలో అంతా అవినీతే జరిగింది. నియోజక వర్గంలో అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట రుణమాఫీ, భూసమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్యతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలపై ఎమ్మెల్యే షకీల్‌ దృష్టి సారించలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుంది.

పదేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది?
► బోధన్‌ గత వైభవాన్ని కోల్పోయింది. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. దీంతో చెరుకు రైతులు, వ్యాపార వర్గాలు, కార్మికులకు ఎంతో నష్టం కలిగింది. ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం జరగలేదు.

ఎన్నికల పోటీ బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యేనా..?
► ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలిచే అవకాశం లేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి షకీల్‌ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో విజయం.

నిజాంషుగర్స్‌ పునరుద్ధరణపై మీరిచ్చే హామీ..?
► ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తాం. ఇచ్చిన హామీని బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది.

బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటే అన్న ఆరోపణపై..?
► బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తోడు దొంగలు. ఆ పార్టీలే లోపాయి కారి ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయి. 2006లో నవీపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి.

ప్రజలకు మీరిచ్చే హామీలు?
► బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అన్ని హామీలను నెరవేరుస్తాం. మూతపడిన నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. రూ. పది లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆడపిల్లల వివాహాలకు రూ.2 లక్షలు అందిస్తాం.

ప్రజల నుంచి ఏమైనా ఆశిస్తున్నారా..?
► నేను 25 ఏళ్ల నుంచి రాజకీయ ప్రజా జీవితంలో కొనసాగుతున్నా.. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడిని. తొలిసారిగా బోధన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నా. గతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను గెలిపించిన ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం కల్పించాలని కోరుకుంటన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తా.
ఇవి చదవండి: ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా

Advertisement
 

తప్పక చదవండి

Advertisement