లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్నత ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతేడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలనే సంకల్పంతో జిల్లా ఇంటర్ అధికారులు కృషి చేస్తున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిత్యం ఈ తరగతులు నిర్వహిస్తున్నారు.
సిలబస్ పూర్తికి చివరి దశ
జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరంలో 2,558 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,338 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటి వరకు 80 శాతం సిలబస్ పూర్తయిందని అధ్యాపకులు తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూనే ప్రయోగాలు కూడా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే సూచించిన నేపథ్యంలో అధ్యాపకులు లక్ష్యం ప్రకారం తరగతులు నిర్వహిస్తున్నారు.
90 రోజుల ప్రణాళికతో..
డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తయిన తర్వాత 2027 ఫిబ్రవరి 24 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే సన్నద్ధం చేయడానికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ వారం, నెలవారీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలు పూర్తయిన తర్వాత పునశ్చరణతోపాటు తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు.
జిల్లా సమాచారం..
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 12
మొదటి సంవత్సరం విద్యార్థులు 2,558
రెండో సంవత్సరం విద్యార్థులు 2,338
నిత్యం హాజరవుతున్నాం..
వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో కళాశాలలో ఉదయం, సాయంత్రం సమయంలో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్‌కు హాజరవుతున్నాం. సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాం. అధ్యాపకుల సూచనలతో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాం. – బిందుశ్రీ, విద్యార్థి, జీజేసీ కడెం


