కుంటాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేతో రైతుల సమస్యల శాశ్వత పరిష్కారం లభిస్తుందని అడిషనల్ కలెక్టర్ వెంకటమాధవరావు(రెవెన్యూ) పేర్కొన్నారు. మండలంలోని ఓలా పంచాయతీ పరిధిలోని రాజాపూర్ తండాలో శుక్రవారం భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మెదన్‌పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడారు. దశలవారీగా భూముల రీసర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో గ్రామాన్ని ఒక యూనిట్ గా తయారుచేసి రైతులకు సమాచారం నోటీసులు అందిస్తామని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి రైతుల అభ్యంతరాలు స్వీకరించడంతో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతుల నుంచి తుది అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం రైతుకు భూఆధార్ నంబర్ కేటాయించడం జరుగుతుందన్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్‌సింగ్, సర్పంచ్ కార్యం పద్మ, డీటీ కార్తీక్‌రెడ్డి, ఆర్ఐ అడెల్లు, రైతులు పాల్గొన్నారు.


