నిర్మల్‌చైన్‌గేట్: వైద్య విద్యార్థులు సేవాభావం కలిగి ఉండాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026 బ్యాచ్ మొదటి సంవత్సరం విద్యార్థుల ‘వైట్ కోట్ సెర్మనీ’ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. నూతనంగా వైద్య విద్యలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా పాజిటివ్ దృక్పథంతో తమ విద్యను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి..
అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ వైద్యులుగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. నిబద్ధతతో పనిచేస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారిలో ఉత్తేజం నింపారు. కళాశాలలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యార్థులకు ప్రత్యేక బస్సు..
విద్యార్థుల ప్రయాణ సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును కలెక్టర్ కళాశాల ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. కళాశాల ఆవరణలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ కేంద్రాన్ని త్వరలోనే మరో ప్రదేశానికి తరలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మొదటి సంవత్సరం విద్యార్థులకు వైట్ కోట్, స్టెతస్కోప్ అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ.శారద, ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ గోపాల్‌సింగ్, అధికారులు శ్రీనివాస్‌కుమార్, సరోజ, దరహాస, రాచెల్ ప్రవీణాపాల్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


