నిర్మల్ రూరల్: సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 1737 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. నిమిషం నిబంధన అమలులో ఉందని, విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. జిల్లా కేంద్రంలో విజయ హైస్కూల్, వాసవి హైస్కూల్, చాణక్య హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, భైంసాలో అల్ఫోర్స్ హైస్కూల్, వేదం హైస్కూల్, వాసవి హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖానాపూర్ ప్రాంత విద్యార్థుల కోసం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ హైస్కూల్లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ ఆధార్ కార్డు, హాల్‌టికెట్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను తీసుకురావాలని సూచించారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు, నవోదయ విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయులను సెంటర్ లెవెల్ అబ్జర్వర్లుగా నియమించారు. తహసీల్దార్లు ఫ్లయింగ్ స్క్వాడ్‌గా వ్యవహరిస్తారు.


