నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు

Nov 26 2026 12:24 AM | Updated on Nov 26 2026 12:24 AM

● ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్‌టౌన్‌: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన గంజా గస్తీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎస్పీ జానకీ షర్మిల జిల్లా కేంద్రంలోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. విద్యాసంస్థల పరిసరాల్లో ఉన్న దుకాణాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించకుండా వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు షాపుల యజమానులకు ఎస్పీ నోటీసులు అందజేశారు. 18 ఏళ్లలోపు బాలబాలికలకు పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని, విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, పట్టణ సీఐ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

భైంసాలో ఎస్పీ గాంజాగస్తీ..

భైంసాటౌన్‌: పట్టణంలో పోలీసులు బుధవారం గాంజాగస్తీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణదారులకు నోటీసులు జారీ చేయించారు. ఆమె వెంట సీఐలు సాయికుమార్‌, ప్రవీణ్‌, రవీందర్‌, ఎస్సైలు ఉన్నారు.

సైబర్‌ మోసంతోనే విద్యార్థి ఆత్మహత్య..!

భైంసాటౌన్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి సంపత్‌కుమార్‌ బెట్టింగ్‌ యాప్‌ వల్ల ఆత్మహత్య చేసుకోలేదని, సైబర్‌ మోసం బారిన పడి మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు. పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన తల్లికి బంగారు నగలు కొనివ్వాలన్న ఆశతో మూడునెలల కిందట ఒక ఆన్‌లైన్‌ గోల్డ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాడన్నారు. ఈ క్రమంలో ప్రతినెలా రూ.5వేల వరకు లాభం వస్తుండడంతో కుటుంబసభ్యుల నుంచి మరిన్ని డబ్బులు తెప్పించుకుని, టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా అందులో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. యాప్‌ డిలీట్‌ కావడంతో మోసపోయినట్లు గ్రహించిన సంపత్‌ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. తన స్నేహితులకు ఎలాంటి సంబంధం లేదని, సంపత్‌ వద్ద సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు చెప్పారు.

పోక్సో కేసులపై అవగాహన ఉండాలి

జిల్లాలో మూడు నెలల్లో 15 పోక్సో కేసులు రిపోర్ట్‌ అయినట్లు ఎస్పీ వెల్లడించారు. వసతి గృహాలు, హాస్టళ్లలో పోలీసు అక్కలు విద్యార్థినులకు చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో ఈ విషయాలు బయటపడ్డాయన్నారు. సమావేశంలో సీఐలు సాయికుమార్‌, ప్రవీణ్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement