నిర్మల్‌టౌన్: జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ డీ.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖ పరిధిలోని వివిధ అంశాల పురోగతిని వివరించారు. భూభారతి పథకం కింద జిల్లాలో 34 పాత కేసులు, 158 కొత్త కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. భూముల రీసర్వేకు సంబంధించి జిల్లాకు కేటాయించిన 40 రోవర్లను వినియోగిస్తూ సర్వే పనులు చేపడుతున్నట్లు డీఆర్వో వివరించారు. 14 నాన్ క్యాడస్ట్రల్ గ్రామాలకు గానూ 9 గ్రామాల్లో, 17 క్యాడస్ట్రల్ గ్రామాలకు గానూ 8 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు తెలిపారు. సర్వే పూర్తయిన గ్రామాల వివరాలను వెంటనే పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న 93 దరఖాస్తులకు సంబంధించి 91 మంది దరఖాస్తుదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరించారు. వీసీలో ఏవో ప్రవీణ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు సంధ్యారాణి, స్వాతి, సర్పరాజ్, ఈడీఎం నదీం, తదితరులు పాల్గొన్నారు.


