బాసర: భూముల రీ సర్వే ప్రక్రియ ద్వారా దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. బుధవారం బాసర మండలంలోని సావర్గంలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను పరిశీలించారు. గ్రామంలోని మొత్తం భూముల విస్తీర్ణం, ఇప్పటి వరకు పూర్తయిన సర్వే, ఇంకా చేయాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేకు ముందుగానే సంబంధిత రైతులకు సమాచారం అందించాలని, సర్వే పూర్తయ్యాక పూర్తి వివరాలను రైతులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు రైతులంతా సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ నమోదు శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ ఏడీ విఠల్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.


