బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. బుధవారం బాసరలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. దర్శనం, వసతి, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికతకు భంగం కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రాకార మండపం, తూర్పు గోపురం, ధ్వజస్తంభం, గర్భాలయం, క్యూ లైన్లు, కిచెన్, డైనింగ్ హాల్ వంటి కీలక నిర్మాణాలను మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ప్రస్తుతం ఉన్న 100 మంది కార్మికుల సంఖ్యను కనీసం 250కి పెంచాలని నిర్మాణ సంస్థలను ఆదేశించారు. అవసరమైతే రాత్రివేళల్లోనూ పనులు చేపట్టాలన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.324 కోట్లు కేటాయించగా, దాతల నుంచి మరో రూ.31 కోట్లు సమకూరినట్లు తెలిపారు. ఏప్రిల్ నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేయాలని, రెండు అతిథి గృహాలను కలిపి ఒకే భవనంగా నిర్మి ంచాలని సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు గోవింద్ హరి, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ వసంత్ నాయక్, ఆలయ ఈవో అంజనీదేవి, ఆర్డీవో దేవిదాస్, వివిధ శాఖల అధికారులు ఏ.రమేశ్, విజయలక్ష్మి, రమణ, అనిల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


