లక్ష్మణచాంద: ఎల్‌నినో ప్రభావంతో ఉపాధి అవకాశాలు తగ్గుతాయన్న అంచనాల నేపథ్యంలో, వీబీజీ రామ్‌జీ పథకం కింద వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్ వరకు చిన్న, సన్నకారు రైతులు, దివ్యాంగులు, మహిళలకు ఎక్కువ పని దినాలు కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పథకం అమలులో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నా, సామాజిక తనిఖీలలో అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యుక్తధార అనే నూతన పోర్టల్ తీసుకువచ్చింది. గ్రామం యూనిట్‌గా ఈ పోర్టల్ ద్వారానే పనులను చేపట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రతీ పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు సంఖ్య..
వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి, ఒక్కో పంచాయతీకి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి పోర్టల్‌లో నమోదు చేస్తారు. మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు సహజ వ నరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి పనులను కూడా ఇందులో చేపడతారు.
పైలెట్‌గా ఒక గ్రామంలో అమలు
ఈ విధానంపై అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఒక గ్రామాన్ని పైలెట్ గా ఎంపిక చేసి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ కొత్త విధానంతో వీబీజీ రామ్‌జీ పనుల్లో అక్రమాలకు ఇక తావు ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామ సభల ద్వారానే ఎంపిక..
ప్రతీ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి, చేపట్టాల్సిన పనులపై చర్చించి పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఇప్పటివరకు చేసిన పనులను ముందుగా పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఒకసారి చేసిన పనిని మళ్లీ చేయకుండా యుక్తధార పోర్టల్ పసిగడుతుంది. కూలీల మస్టర్లలో అవకతవకలకు అవకాశం లేకుండా పోర్టల్‌ను రూపొందించారు. పనులు ప్రారంభించే సమయంలో కూలీల ముఖ చిత్రాలతో పని ప్రదేశంలోనే ఆన్ లైన్ లో నమోదు చేస్తారు.
జిల్లా సమాచారం.....
మండలాలు 19
గ్రామ పంచాయతీలు 400
జాబ్ కార్డులు 1.76 లక్షలు
కూలీలు 3.31 లక్షలు
యాక్టివ్ జాబ్ కార్డులు 1.26 లక్షలు
యాక్టివ్ కూలీలు 2.18 లక్షలు
పనికి హాజరవుతున్న కూలీలు 31,088


