అందరూ సహకరించాలి
పొగాకు వినియోగంతో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోపాటు గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, యువత పొగాకు వ్యసనానికి బానిసలు కాకుండా కాపాడడం అందరి బాధ్యత. దుకాణదారులు నిబంధనలు పాటించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేలా చూడాలి. పిల్లల భవిష్యత్తును కాపాడుతూ పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – జానకీషర్మిల, ఎస్పీ
నిర్మల్‌టౌన్: జిల్లాలో పొగాకు ఉత్పత్తుల విక్రయాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కోట్పా చట్టం–2003 అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
దుకాణదారులకు నోటీసులు..
పట్టణాలు, గ్రామాల్లోని పొగాకు ఉత్పత్తుల దుకాణాలను పోలీసులు సందర్శించి మంగళవారం దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. 18 ఏళ్లలోపు బాలబాలికలకు సిగరెట్లు, గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని స్పష్టం చేశారు. విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు విక్రయాలు పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.


