నిర్మల్: పుష్కలమైన జలవనరులున్న జిల్లా ధాన్యరాసులను పండిస్తోంది. కానీ ఒకప్పుడు పట్టుమని పది రైస్ మిల్లులు కూడా ఇక్కడ ఉండేవి కావు. ధాన్యాన్ని మర ఆడించేందుకు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు పంపేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఊరికో మిల్లు అన్నట్లు ఎక్కడపడితే అక్కడ రేకుల షెడ్లు వేసి మిల్లులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఐదారు మిల్లులు వెలిశాయి. వీటి వెనుక ఉద్దేశం వ్యాపారం కాదు, ప్రభుత్వ ధాన్యాన్ని కాజేసి ధనాన్ని పోగుచేయడమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు, ముగ్గురు బడా మిల్లర్ల నేతలే తెరవెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు.
ధాన్యం కాజేసి.. ధనం పోగేసి..
ప్రభుత్వం రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లులకు కేటాయిస్తుంది. నిర్ణీత గడువులోగా ధాన్యాన్ని మర ఆడించి నిర్దేశిత పరిమాణంలో బియ్యాన్ని అప్పగించాలి. కానీ కొందరు మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం అప్పగించే సమయంలో సాకులు చెబుతూ గడువు పొడిగింపులు కోరుతున్నారు.
బినామీల పేరిట మిల్లులు..
సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై కేసులు పెట్టినా ప్రయోజనం లేదు. డిఫాల్టర్‌గా ప్రకటిస్తే వెంటనే బినామీ పేరిట కొత్త మిల్లు పెట్టి దందాను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఇతర జిల్లాల మిల్లర్లు ఇక్కడ దందా చేసేవారు. ఇప్పుడు జిల్లావాసులే పక్క జిల్లాల్లో మిల్లులు పెట్టి దోపిడీ పాఠాలు నేర్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
చర్యలుంటాయా..?
‘ఈడీ కేసులు పెడుతోంది.. విజిలెన్స్ తనిఖీలు చేస్తోంది.. మిల్లులపై కేసులు నమోదవుతున్నాయి..’ అంటూ అప్పుడప్పుడు చర్చలు రావడమే తప్ప.. ఇప్పటికీ బియ్యం మే(నే)తలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో అరకొరగా ఒకట్రెండు కేసుల్లో కొందరిని అరెస్టు చేయడం మినహా.. ఇప్పటికీ ఒక్క ‘పెద్ద మిల్లర్’ జోలికి వెళ్లడం లేదు. మొన్నటిమొన్న ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ నివాసంలో ఈడీ సోదాలు మినహా పెద్దగా ‘రికవరీ’ చర్యలూ లేవన్న వాదనలు ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక పలుకుబడి కారణంగానే ధాన్యాన్ని విక్రయించినా, బియ్యం బకాయిలను ఎగ్గొట్టినా పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి.
పంట లేని చోటా మిల్లులు..
వరి ఎక్కువగా పండేది నిర్మల్ డివిజన్‌లో.. కానీ మిల్లులు ఎక్కువగా ఉన్నది భైంసా డివిజన్‌లో. నల్లరేగడి భూములున్న ఈ ప్రాంతంలో పత్తి, సోయా, శనగలే ఎక్కువ. లోకేశ్వరం, కుంటాలలో మాత్రమే వరి ఎక్కువగా సాగవుతుంది. ఇక్కడ ఇన్ని మిల్లుల వెనుక కథ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. గతంలో రైసుమిల్లర్ల సంఘం జిల్లా బాధ్యుడిగా చేసిన ఓ బడా మిల్లర్ భైంసా సమీపంలో ఒకే దగ్గర పదికి పైగా మిల్లులను ఏర్పాటు చేశారు. పక్క జిల్లాలోనూ మిల్లులను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. మరో నేత పెద్దమొత్తంలో సీఎంఆర్‌ను పక్కదోవ పట్టించి, స్వల్పకాలంలోనే కోట్లకు పడగలెత్తాడు.
ప్రతీకాత్మక చిత్రం


