నిర్మల్టౌన్: జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి బ్యాంకులు చేయూతనివ్వాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. ప్రభుత్వ బ్యాంకింగ్ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు, బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో బ్యాంకుల పనితీరు, డిపాజిట్లు, రుణాల పంపిణీ, క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి, తదితర అంశాలపై సమీక్షించారు. గత త్రైమాసికంలో రూ.1,347.42 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు రూ.2,447.42 కోట్లకు చేరినట్లు వివరించారు. ఎంఎస్ఎంఈ రుణాలు గత త్రైమాసికంలో రూ.497.93 కోట్లు ఉండగా రూ.644.23 కోట్లకు పెరిగాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్బీవో రాములు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్గోపాల్, టీజీబీ ఆర్ఎం నరేష్, నాబార్డ్ ప్రతినిధి అబ్దుల్లా రహూఫ్, డీఆర్డీవో రాథోడ్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


