టీ–హబ్‌లో మొరాయిస్తున్న యంత్రాలు 15 రోజులుగా నిలిచిన రోగ నిర్ధారణ పరీక్షలు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ నష్టపోతున్న పేదలు
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు గత ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్(టీ–హబ్) కేంద్రాలు ఏ ర్పాటు చేసింది. అయితే నిర్మల్‌లోని కేంద్రం సమస్యల నిలయంగా మారింది. జిల్లాలో ఓవైపు వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండగా, టీ–హబ్‌లోని యంత్రాలు తరచూ మొరాయించ డం రోగులకు శాపంగా మారుతోంది. 15 రో జులుగా కీలక వైద్య పరీక్షలు నిలిచిపోవడంతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేదలు వ్యాధి నిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.
విజృంభిస్తున్న జ్వరాలు..
వాతావరణ మార్పుల కారణంగా జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైద్యులు వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్షలు సూచిస్తుండగా, టీ–హబ్‌లో సౌకర్యం లేకపోవడంతో రోగులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.
ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీ..
ప్రభుత్వ కేంద్రంలో పరీక్షలు జరగకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. కూలీనాలి చేసుకుని బతి కే గ్రామీణులు, పేద కుటుంబాలకు వైద్య పరీక్షల ఖర్చు భారంగా మారుతోంది.
నిర్మల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 10న ఒళ్లంతా దురద సమస్యతో జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షించిన వైద్యుడు మూడు రకాల రక్త పరీక్షలు రాశారు. నమూనాలు ఇచ్చేందుకు రక్త పరీక్షల కేంద్రానికి వెళ్లగా, యంత్రాలు పనిచేయడం లేదని, మూడింటిలో కేవలం ఒక పరీక్ష మాత్రమే అవుతుందని సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక ఆ వ్యక్తి ఒక్క పరీక్ష రిపోర్టుతోనే తిరిగి వైద్యుడి వద్దకు వెళ్లాడు. పూర్తిస్థాయి రిపోర్టులు లేకపోవడంతో వైద్యుడు కూడా సాధారణ మందులు రాసి పంపించేశారు. పది రోజులుగా టీహబ్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. కీలక పరీక్షలు చేయడం లేదు.
స్పందించని అధికారులు..
15 రోజులుగా పరీక్షలు నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణం స్పందించి టీ–హబ్‌లోని యంత్రాలకు మరమ్మతులు చేయించి, అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి తెచ్చి పేదలకు ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు. జ్వరాలతో వచ్చే రోగులకు అత్యవసరంగా అవసరమైన రక్త పరీక్షల విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. నమూనాలు సేకరించినప్పటికీ, రిపోర్టులు రావడానికి రోజుల తరబడి సమయం పడుతోంది. దీంతో రోగులు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. వ్యాధి నిర్ధారణ ఆలస్యంతో వైద్యులు చికిత్స అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మొరాయిస్తున్న యంత్రాలు..
జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న టీ–హబ్‌కు ప్రతిరోజూ వందలాది మంది రోగుల రక్త, మూత్ర నమూనాలు వస్తుంటాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల నుంచి సేకరించిన నమూనాలను కూడా ఇక్కడికే పంపుతున్నారు. అయితే ల్యాబ్‌లోని విలువైన యంత్రాలు సాంకేతిక లోపాలతో తరచూ ఆగిపోతున్నాయి. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, రీఏజెంట్ల(కెమికల్స్) కొరత కారణంగా రెండు వారాలుగా థైరాయిడ్, లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్‌ఎఫ్‌టీ), కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (కేఎఫ్‌టీ) వంటి ముఖ్యమైన పరీక్షలు నిలిచిపోయాయి.
మరమ్మతు చేయిస్తున్నాం..
జిల్లా కేంద్రంలో ఉన్న టీహబ్‌లో యంత్రాలకు మరమ్మతు చేయిస్తున్నాం. టెక్నీషియన్స్ వచ్చి టీ హబ్ యంత్రాన్ని పరీక్షించారు. యంత్రంలోని ముఖ్యమైన భాగం చెడిపోవడంతో ఆర్డర్ పెట్టారు. రెండు మూడు రోజుల్లో పరికరం వస్తుంది సమస్య పరిష్కారం అవుతుంది.
– డాక్టర్ రాకేశ్, టీ హబ్ ఇన్‌చార్జి


