లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతు న్న విద్యార్థుల్లో పఠనాసక్తి, విజ్ఞానం పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 1,138 పాఠశాలల్లో గ్రంథాలయాలను నూతనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. జిల్లా గ్రంథాలయాల వద్ద ఉన్న నిధుల నుంచి పాఠశాలల్లోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల బ్యాంక్ ఖాతాలకు ఇప్పటికే నిధులు బదలాయించింది. విడుదలైన నిధులను వినియోగించి వెంటనే రీడింగ్ రూమ్‌లు ఆధునీకరించి అందుబాటులోకి తేవాలని డీఈవోలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు.
మౌలిక సదుపాయాలకు అదనపు గ్రాంట్
జిల్లా గ్రంథాలయ నిధుల నుంచి రీడింగ్ రూమ్‌ల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన, పుస్తకాల కొనుగోలు కోసం జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.15 వేల గ్రాంట్ విడుదల చేశారు. ఈ నిధులతో గ్రంథాలయ గదులకు మరమ్మతులు, పెయింటింగ్, బల్బులు, ఫ్యాన్లు అమర్చడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు చదవడానికి రీడింగ్ టేబుళ్లు, కుర్చీ లు, ర్యాక్‌లు సమకూర్చుకోవాలని తెలిపారు. మంజూరైన నిధులు కేవలం గ్రంథాలయ అవసరాలకే వినియోగించాలని, ఇతర అవసరాలకు మళ్లించరాదని అధికారులు స్పష్టం చేశారు. గ్రంథాలయ అభివృద్ధికి ముందు, తర్వాత ఫొటోలు తీసి యూసీలు అధికారులకు సమర్పించాలి. గ్రంథాలయాల పనితీరును నిరంతరం తనిఖీ చేస్తూ పర్యవేక్షణ చేయాలని డీఈవోలను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశించారు.
14న ప్రారంభం
జిల్లాలో ఎంపికై న ఎనిమిది పాఠశాలల్లోని రీడింగ్ రూమ్‌లను ఈ నెల 14న కలెక్టర్, గ్రంథాలయ చైర్మన్, జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా అధికారులు తెలిపారు.
గ్రంథాలయాల అభివృద్ధి
జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న 8 పాఠశాలలు గ్రంథాలయాల ఆధునికీకరణ కు ఎంపికయ్యాయి. అమ్మ ఆదర్శ కమిటీల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగింది. నిధులు గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి. అవసరమైన పుస్తకాలు, వసతులు సమకూర్చుకోవాలి. – భోజన్న, డీఈవో
జిల్లాలో ఎనిమిది పాఠశాలలకు..
జిల్లాలోని పొన్కల్, లింగాపూర్, మామడ, నర్సాపూర్(జి), కిసాన్‌గల్లీ(బాలికలు), బోసి, కుభీర్, సోమవార్‌పేట్(బాలికల) ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.10 వేల చొప్పున సమగ్రశిక్ష నుంచి నిధులు ప్రభుత్వం బదలాయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నిధులతో తెలుగు, ఆంగ్ల దినపత్రికలు, మ్యాగజైన్‌లు, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, పర్యావరణం, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచించారు.


