నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రం గులాబీ మయమైంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రైతు గర్జన సభ నిర్వహించనున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, వీధులన్నీ గులాబీ జెండాలు, పార్టీ నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో నిండిపోయాయి. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. సుమారు 20 వేల మందికి పైగా హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో వేదిక, ప్రజలు, కార్యకర్తలు కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, మాజీ ఎంపీ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రాంకిషన్‌రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ పరిశీలించారు. నిర్మల్ పట్టణంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కోసం, రైతుల పక్షాన పోరాటం చేసేందుకే రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగేలా పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు, కాలువలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నల్ల వినయ్‌రెడ్డి, లోలం శ్యాంసుందర్, కౌన్సిలర్లు శ్రీకాంత్ యాదవ్, రాము తదితరులు పాల్గొన్నారు.


