నిర్మల్, చుట్టూ గ్రామాల్లో భూముల గుర్తింపు ఆక్రమణల చెర విడిపించేలా కార్యాచరణ కలెక్టర్ తీరు దూకుడుతో కబ్జాదారుల్లో గుబులు
నిర్మల్: చెరువులు, కందకాలు, దేవుడి మాన్యాలు, అసైన్డ్ ల్యాండ్, పోరంబోకు భూములు.. ఇలా దేనినీ వదలకుండా ఖాళీగా కనిపిస్తే చాలు అడ్డదారుల్లో, అధికారం సాయంతో ఆక్రమించేశారు. ఏళ్లుగా అడిగేవారు, ఆపేవారు లేకపోవడంతో యథేచ్ఛగా ఆక్రమణలు సాగించారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. స్మార్ట్ పరిపాలనవైపు ప్రభుత్వాలు అడుగులు వేయడంతో ఆక్రమణలు వెలుగులోకి వస్తున్నాయి. కలెక్టర్ భవేశ్‌మిశ్రా సీరియస్‌గా స్పందించడంతో రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూముల పరిరక్షణపై దృష్టి సారించింది. పలు మండలాల్లో సమగ్ర సర్వే కొనసాగుతుండగా, జిల్లా కేంద్రం, చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో డిజిటల్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. దీంతో సర్కారు భూములు, ఆక్రమణలు బయటపడనున్నాయి.
రూ.కోట్ల విలువైన భూములు..
నిర్మల్ జిల్లా కేంద్రంగా మారి విస్తరిస్తుండటం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరగడంతో భూమి విలువ లక్షల నుంచి కోట్లకు చేరింది. చిన్న ప్లాట్‌కు కనీసం రూ.10 లక్షలు, పేరున్న ప్రాంతాల్లో రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో విలువైన ప్రభుత్వ భూములపై అక్రమార్కుల దృష్టి పడింది. హద్దులపై స్పష్టత లేకపోవడం, రికార్డులు, క్షేత్రస్థాయి వ్యత్యాసాలు, ఇరిగేషన్ అధికారులకు స్పష్టత లేకపోవడం ఆక్రమణలకు కబ్జాదారులకు కలిసివచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సర్వే ఏం తేలుస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.
హద్దులు తేలితేనే..
సర్వేలో ముందుగా గ్రామ సరిహద్దులు గుర్తిస్తారు. తర్వాత రికార్డుల్లోని భూములు క్షేత్రస్థాయిలో ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలిస్తారు. పరిధి, ప్రైవేటు నిర్మాణాలు, చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తులపై ఆక్రమణలు ఉన్నాయా అనే అంశాలను డిజిటల్ సర్వే తేలుస్తుంది. రికార్డులను క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చి సరిహద్దులు నిర్ధారిస్తే ఆక్రమణలపై స్పష్టత వస్తుంది. గుర్తించిన తర్వాత చర్యలు ఎలా ఉంటాయన్నది కీలకం. కేవలం సర్వేతో సరిపెట్టకుండా పక్కా చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో సర్వే..
నిర్మల్ అర్బన్ పరిధిలోని నాలుగు రెవెన్యూ గ్రామాల్లో డిజిటల్ సర్వే నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి రోవర్లను సమకూర్చాం. ఈ సర్వే ఇరిగేషన్, ప్రభుత్వ భూ ఆక్రమణల కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. తర్వాత కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం.
– భవేశ్‌మిశ్రా, కలెక్టర్
కొరడా ఝళిపించేనా?
పట్టాకు ఉన్న కొంత భూమికి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకోవడం, అమ్మడానికి వీలులేని అసైన్డ్ భూములను సొంతం చేసుకోవడం, అసైన్డ్ ల్యాండ్‌లో ఫంక్షన్ హాల్ నిర్మించడం, బంధువుల పేర్ల మీద బదలాయించుకోవడం, పునరావాస గ్రామాలకు ఇవ్వాల్సిన డీ–1 పట్టాలతో భూములు రాసుకోవడం వంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అధికారులకు తెలిసినా ఏళ్లుగా నిర్లక్ష్యం చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదులు వస్తున్నా సీరియస్‌గా పరిగణించలేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.
లెక్క తేలుస్తారా?
ఒకట్రెండు రోజుల్లో ప్రారంభమయ్యే డిజిట ల్ సర్వేతో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, విస్తీర్ణం ఎంత, ఆక్రమణలకు గురయ్యాయా అనే విషయాలను నిగ్గు తేలుతుంది. కబ్జాలకు కేంద్రంగా మారిన నిర్మల్ పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న ఈ సర్వేపై ఆసక్తి నెలకొంది. ఆక్రమిత భూములు, ఆక్రమణదారుల పేర్లు బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం


