ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన ఆదిమూలం సంతోష్(45) అప్పులు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. ముత్నూర్ గ్రామానికి చెందిన ఆదిమూలం సంతోష్ ఆదే గ్రామంలో కటింగ్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి అవసరాలు, షాప్ నిర్వహణ కోసం పలు ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పు చేశాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో తీసుకున్న ఫైనాన్స్ డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ వారు రోజూ ఇంటికి వచ్చి డబ్బులు కట్టాలని వేధించేవారు. ఈ నెల 27న ఫైనాన్స్ నిర్వాహకులు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న భార్య, కుటుంబ సభ్యులతో డబ్బులు కట్టాలని గొడవకు దిగారు. ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుడు శంకర్‌గూడ గ్రామానికి చెందిన సాయి కూడ డబ్బుల కోసం గొడవ చేశాడు. అప్పుల బాధ భరించలేక క్షణికావేశంలో బుధవారం ఉదయం ఇంటి వెనుక ఉన్న చెట్టుకు ఉరేసుకుని సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సంతోష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. భార్య ఆదిమూలం జయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


