13 మండలాల్లో 25 బృందాలతో పోలీసుల దాడులు ప్రామిసరీ నోట్లు, చెక్కులు, స్థలాల పత్రాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: అధిక వడ్డీల పేరుతో రైతులు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారులపై జిల్లా పోలీసులు కొరడా ఝులిపించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 25 పోలీసు బృందాలతో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. 18 కేసులు నమోదు చేశారు. వడ్డీ వ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు, రిజిస్టర్లు, ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్ వన్‌టౌన్, టూటౌన్, మావల, రూరల్, బోథ్, బేల, ఉట్నూర్, ఇచ్చోడ, నార్నూర్, గుడిహత్నూర్, నేరడిగొండ, జైనథ్ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తూ, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. లైసెన్సులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహించడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వంటి అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి వేధింపులకు గురైతే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ల వారీగా కేసులు..
ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, టూ టౌన్ పరిధిలో మూడు, మావల పరిధిలో నాలుగు, ఆదిలాబాద్ రూరల్ పరిధిలో ఒకటి, జైనథ్‌లో ఒకటి, బేలలో ఒకటి, బోథ్‌లో ఒకటి, ఉట్నూర్‌లో రెండు, గుడిహత్నూర్‌లో ఒకటి, నార్నూర్‌లో ఒకటి, నేరడిగొండలో ఒకటి చొప్పున కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ కేసుల్లో తెలంగాణ ఏరియా మనీ లెండర్స్ యాక్ట్ ప్రకారం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కేసులు నమోదైన వారి వివరాలు..
ఆదిలాబాద్ వన్‌టౌన్ పరిధిలో ఎస్‌కే సాజిద్, ఎ ర్రోజు కేశవ్, ఓరగంటి రఘు, ఆదిలాబాద్ టూటౌన్‌లో తౌఫిక్ అహ్మద్, షేక్ అక్బర్, మావల పరిధిలో దుర్గా శేఖర్ రెడ్డి, దాసరి నరోత్తం, చిట్టి రాజేశ్వర్, షేక్ ఆసిఫ్, ఆదిలాబాద్ రూరల్‌లో అజయ్ కుమార్ గాడ్సే, జైనథ్‌లో ఆత్మకూరు అమరేందర్, బేలలో కార్తీక్, బోథ్‌లో రమేశ్, ఉట్నూర్‌లో సాయి రెడ్డి, ఇప్ప సంతోష్, నేరడిగొండలో కలాలి వెంకటరమణ, నార్నూర్‌లో అరే అశ్విని, గుడిహత్నూర్‌లో కేంద్రీ రాహుల్‌లపై కేసులు నమోదయ్యాయి.


