రేషన్‌లో నిత్యావసరాలు! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌లో నిత్యావసరాలు!

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

బియ్యంతోపాటు ఆరు రకాల సరుకులు ఎల్‌నినో నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా.. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీకి ప్రభుత్వం కసరత్తు

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎల్‌నినో ప్రభావంతో నిత్యావసరాల ధరలు ఇప్పటికే మండుతున్నాయి. పేద, మధ్య తరగతిపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. రేషన్‌ వ్యవస్థ ద్వారా గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్‌, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి నిత్యావసరాలు సబ్సిడీ ధరలకు పంపిణీ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు.

మంత్రి సమీక్ష, ఆదేశాలు

గత సోమవారం సెక్రటేరియట్‌లో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సరుకుల సేకరణ, పంపిణీ వ్యయం, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పరిమాణాలపై సమగ్ర అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదిక వచ్చాక పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పెరుగుతున్న ధరలు..

ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో పంటల దిగుబడి తగ్గింది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచుతున్నారు. కిలో బియ్యం వంద రూపాయలకు చేరువలో ఉండగా, కూరగాయలు, చక్కెర, పప్పులు, ఇతర వంట సామగ్రి ధరలు కూడా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. కూరగా యల దిగుబడి తగ్గి ధరలు పెరుగుతున్నాయి.

14 నెలల నిల్వలు..

సుమారు 14 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది మార్కెట్‌లో పెరుగుతున్న ధరల నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించడంతోపాటు ఆహార కొరతను అధిగమించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. సేకరణ, లబ్ధిదారుల సంఖ్య, ఆర్థిక భారం తదితర అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. దాని ఆధారంగా పరిమాణం, సబ్సిడీ స్థాయిని నిర్ణయించి బహిరంగ మార్కెట్‌ ధర కంటే తక్కువకే అందించనున్నారు.

బియ్యంతోపాటు ఆరు సరుకులు..

రేషన్‌ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రస్తుతం అందిస్తున్న బియ్యానికి తోడు ఆరు రకాల నిత్యావసర వస్తువులు అందించేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పెరిగిన ధరలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. జిల్లాలో 2.49 లక్షల రేషన్‌ కార్డుదారులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement