వేర్వేరు చోరీ కేసుల్లో నిందితులు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోరీ కేసుల్లో నిందితులు రిమాండ్‌

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

ఉట్నూర్‌రూరల్‌: ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన వేర్వేరు చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై జి.విజయ్‌ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హర్కాపూర్‌ గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి కాయిల్‌ వైర్‌, సుమారు 30 లీటర్ల ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ చోరీకి గురైనట్లు బాధితుడు గత నెల 10న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఘటనలో సుమారు రూ.40,000 విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. చోరీకి గురైన సామగ్రిని కొనుగోలు చేసిన షేక్‌ అఫ్రోజ్‌ ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చోరీ చేసిన నిందితులను గతంలోనే అరెస్టు చేశామన్నారు.

ఇంటి దొంగతనం కేసులో..

హర్కాపూర్‌ గ్రామంలో నివాసం ఉంటున్న చిరివెల్ల హరి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి బంగారంతో పాటు రూ.20 వేలు నగదు చోరీ జరిగినట్లు బాధితుడి తండ్రి ఈ నెల 16న ఫిర్యాదు చేశాడన్నారు. చోరీకి పాల్పడిన అంధారే సిద్ధేశ్వర్‌ అలియాస్‌ సిద్దు, హనుమంత నారాయణ్‌ జాదవ్‌లను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి దొంగతనం చేసిన సామగ్రిని రికవరీ చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఘటనలో సుమారు రూ.లక్ష 20 వేల విలువైన ఆస్తి చోరీకి గురికాగా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

భైంసాటౌన్‌: ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి ఆగి ఉన్న లారీని ఢీకొని ఒకరు తీవ్ర గాయాలపాలైన ఘటన పట్టణంలోని భోకర్‌ రోడ్డులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తానూర్‌ మండలం భోసి గ్రామానికి చెందిన నరేశ్‌ పని నిమిత్తం సోమవారం భైంసాకు వచ్చి తిరిగి సాయంత్రం బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓవైసీనగర్‌కు చెందిన అజిజ్‌ ఐచర్‌ వాహనం నడుపుతూ అకస్మాత్తుగా రైట్‌ టర్న్‌ తీసుకోవడంతో ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో నరేశ్‌ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. ఘటనలో నరేశ్‌ కాలు విరగగా, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement