● కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌చైన్‌గేట్: పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఆదేశించారు. వ్యాపార సముదాయాలకు తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఎస్పీ జానకీషర్మిలతో కలిసి వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లపై ఆక్రమణలు, పశువుల సంచారం, ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై చర్చించారు. పార్కింగ్ సదుపాయం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వ్యాపార సముదాయాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలన్నారు. నిబంధనలు పాటించనివారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై పశువులను వదిలే యజమానులకు జరిమానా విధించాలన్నారు. అవసరమైతే పశువులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారులు, మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారులపై బ్లాక్ స్పాట్లు గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రమాదకరంగా భారీ వాహనాలను నిలిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల నిర్మాణ పనులకు కూడా నిబంధనలకు అనుగుణంగానే ఇసుకను వినియోగించాలన్నారు. గ్రామాల్లో వీడీసీలు ఇసుక వేలం నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలి..
అనంతరం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘భూభారతి’, ‘సీఎం ప్రజావాణి’లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేశ్, వెంకట మాధవరావు, ఏఎస్పీలు సాయికిరణ్, ఉపేంద్రారెడ్డి, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, తహశీల్దార్లు పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా..
జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందు కు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరి ష్కారానికి పోలీసు శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, ఎకై ్సజ్ శాఖల సమన్వయంతో గంజాయి సాగు, విక్రయాలను అరికడుతున్నామని, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు.


