లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఆడపడుచులు ఎక్కడ ఉన్నా బతుకమ్మ సమయంలో పుట్టింటికి చేరుకుని తీరొక్క పూలతో బతుకమ్మను చేసి ఆరాధిస్తారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ ప్రాధాన్యత, ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు సెలవులకు ముందు రోజు పాఠశాలల్లో కూడా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పీఎంశ్రీ పాఠశాలలకు ప్రభుత్వం బతుకమ్మ నిధులు మంజూరు చేసింది.
జిల్లాలో నిధులు
జిల్లా వ్యాప్తంగా 20 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు బతుకమ్మ సంబరాల నిర్వహణ కోసం రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం రూ.2 లక్షలు జిల్లాకు వచ్చాయి. శనివారం నుంచి దసరా సెలవులు ఉండడంతో శుక్రవారం జిల్లాలోని అన్ని పీఎంశ్రీ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. రంగురంగుల పూలు, బతుకమ్మల కొనుగోలు, ముగ్గులు, ప్లెక్సీ, సౌండ్ సిస్టమ్, కోలలు, బాలికలకు స్వీట్లు వంటి కొనుగోలు చేశారు.
ముందస్తు ఖర్చులు
పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌వోలు, ప్రిన్సిపాల్స్ ముందుగా సంబరాలకు అయిన ఖర్చులు పెట్టి, అనంతరం బిల్లులు సమర్పించి ఎస్టీవో నుంచి తీసుకుంటామని తెలిపారు.
నిధులతో ఘనంగా సంబరాలు
జిల్లాలోని పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే బతుకమ్మ సబంరాలు మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిధులు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు కేటాయించింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని పాఠశాలలో ఘనంగా సంబరాలు నిర్వహించాం. – భోజన్న, డీఈవో


