● ఎన్నికల బరిలో 12 యూనియన్లు | - | Sakshi
Sakshi News home page

● ఎన్నికల బరిలో 12 యూనియన్లు

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

● ఎన్నికల బరిలో 12 యూనియన్లు ● పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి ● ఉదయం 5 గంటల నుంచి ఓటింగ్‌ షురూ

ఆదిలాబాద్‌/నిర్మల్‌టౌన్‌/ఆసిఫాబాద్‌/మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణ ఆర్టీసీలో దాదాపు పదేళ్ల విరామం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 5గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కార్మిక శాఖ అధికారులు పోలింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో మొత్తం 12 కార్మిక సంఘాలు నిలిచాయి.

మంచిర్యాలలో అత్యధికం..

ఆయా డిపోల పరిధిలో 1,773 మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంచిర్యాల డిపోలో అత్యధికంగా 403మంది ఓటర్లు ఉన్నారు. ఆయా డిపోల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ప్రతీ ఉద్యోగి బ్యాలెట్‌ పద్ధతిన రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటును రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘానికి, మరో ఓటును స్థానిక గుర్తింపు సంఘం కోసం వినియోగించాలి. రాష్ట్రస్థాయి బ్యాలెట్‌ పేపర్‌, రీజియన్‌ బ్యాలెట్‌ పేపర్లు వేర్వేరు రంగుల్లో ముద్రించారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఇద్దరు పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. యూనియన్‌ తరఫున ఒక్కొక్కరు పోలింగ్‌ ఏజెంట్‌గా పాల్గొంటారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లపై ఆంక్షలు విధించారు. మంచిర్యాల డిపోలో పోలింగ్‌ కేంద్రాలకు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ దుర్గం క్రాంతి పర్యవేక్షణలో గురువారం బ్యాలెట్‌ బాక్సులను తరలించారు. ఒక బ్యాలెట్‌ బాక్సు అవసరమైనప్పటికీ మరొకటి అదనంగా అందుబాటులో ఉంచారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను పటిష్ఠ భద్రత మధ్య భద్రపర్చనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం ఈ నెల 17న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.

హోరాహోరీ ప్రచారం..

ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా సంఘాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం, పీఆర్సీ, డీఏ బకాయిలు, ఉద్యోగ భద్రత చుట్లూ ప్రచారం సాగింది. రెండు కూటమిల మధ్య తీవ్ర పోరు నెలకొంది. టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్‌ యూనియన్లు కూటమిగా బరిలో దిగగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఎస్‌డబ్ల్యూయూలు టీడబ్ల్యూయూ గుర్తుపై పోటీలో నిలిచాయి.

డిపో ఓటర్లు

మంచిర్యాల 403

ఆదిలాబాద్‌ 398

నిర్మల్‌ 385

ఆసిఫాబాద్‌ 251

భైంసా 193

ఉట్నూర్‌ 111

ఆర్‌ఎం ఆఫీస్‌ 32

మొత్తం 1773

2016లో చివరిసారిగా..

ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు 2016లో చివరిసారిగా జరిగాయి. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో యూనియన్లను రద్దు చేయడంతో కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సమస్యల పరిష్కా రం, హక్కుల కోసం పోరాడే సంఘాలు లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు షె డ్యూల్‌ ప్రకటించడంతో కార్మిక సంఘాల్లో ఉ త్సాహం నెలకొంది. పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో కార్మికులు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement